25, సెప్టెంబర్ 2016, ఆదివారం

తెలివి...ఏ ఒక్కరి సొమ్మూ కాదు!


అడవి లోపల నొక నక్క యచటి జంతు
జాలములఁ జంపి తినుచును సంతసముగ
జీవనము సేయుచుండెను జిత్తు లడరఁ
బ్రతిదినమ్మును వేఁటయన్ వ్రతముఁ బూని! 1

ఒక్కనాఁడట వేఁటాడ నెక్కడయును
నొక్క జంతువునుం గూడఁ జిక్కకున్న
నలసట బలిమిచేతను నాఁకలిఁ గొని
నెమ్మదిగ వచ్చుచుండెను నీరసమున! 2

మడుఁగులో నీఁదు లాడియు మడుఁగు వీడి,
తీరముననున్న భూమిపై తిరుగుచున్న
యొక్క తాఁబేటినిం జూచి, యుత్సుకతనుఁ
బూని, యలఁతి సత్తువఁ, బట్టఁ బూనె నక్క! 3

తననుఁ బట్టంగ వచ్చు నక్క నటఁ గాంచి,
"యయ్యొ, దైవమా! వచ్చు నీ యాపద నిఁకఁ
దప్పిపోవంగఁ జేయుమా, యొప్పిదముగ!"
ననుచుఁ బ్రార్థించి, వేగమ్ముగను బరువిడె! 4

పరుఁగు లెత్తెడి తాఁబేటిఁ బట్టుకొనఁగ
ననుసరించియు నక్క దానినిఁ బదమున
నొక్కిపట్టియు బంధించి, మిక్కుటమగు
నాఁకఁటి వెతఁ దీర్చుకొన నాయత్తమాయె! 5

అట్లు తన నారఁగించ నాయత్తమైన
నక్క వాలకమునుఁ గని యక్కమఠము
భయము మెయిఁ దలఁ గాళ్ళను రయముగాను
డిప్పలోనికి దూర్చెఁ దా నొప్పుగాను! 6

నక్క దానినిఁ దినఁగాను నొక్కతఱినిఁ
బండ్లతో దాని డిప్పనుఁ బట్టి కొఱుక;
నెట్టి మాంసమ్ము దాని పంటికిని దొరుక
కున్న; నొక బండ ఱాతికిఁ గొట్టఁ బూనె! 7

దానిఁ బసిగట్టి కూర్మమ్ము దాని తోడ,
"నక్కబావా! ననున్ నీట నానఁబెట్టి,
తినఁగఁ బూనుచో, మెత్తఁబడెదను గాన,
సులభముగ నీవు ననుఁ దినఁ గలుగుదు వయ!" 8

అనిన తాఁబేలు మాటల నాలకించి,
చెఱువు లోపలఁ బెట్టియుఁ, జెదరి చనక
యుంటకై దానిపైఁ గాలి నుంచి, నొక్కి
పెట్టె, నది నానుటకయి తా నట్టి తఱిని! 9

కొంత సేపైన పిమ్మటఁ గూర్మము విన,
"మెత్తఁ బడితివె నీ వింక నిత్తఱి నట"
ననఁగఁ దాఁబేలు "వినుమయ్య, నక్కబావ!
యంత నానితిఁ, బాదమ్ము పొంతఁ దక్క! 10

కాలి నుంచిన చోటున గట్టిగానె
యున్నదయ్య! కాలినిఁ దీసియును మఱలఁగఁ
బెట్టుచో నానఁ గల" నంచు నొట్టుపెట్టి,
పలుక, నమ్మి, యట్టులె సేయఁ, బరుగునఁ జనె! 11

"నక్క జిత్తు లన్నియు నుండ నాదు చెంత,
నీటఁ దప్పించుకొనియెఁ దాఁబేటి బుఱ్ఱ!"
యనుచు నక్కయె నకనక లాడుచుఁ జనె!
తెలివి యొక్కరి సొత్తు కా దెప్పటికిని!! 12


స్వస్తి


గమనిక:
మిత్రులారా! ఈ దిగువ మీరు పెట్టే ప్రోత్సాహక వ్యాఖ్యలే. నన్ను ద్విగుణీకృత ఉత్సాహవంతుణ్ణి చేసి, మరిన్ని పద్య కథలు రాయడానికి పురికొల్పుతాయి. కావున ఈ దిగువన గల డబ్బాలో వ్యాఖ్యను పోస్టు చేయగలరని మనవి.


6 కామెంట్‌లు:

  1. బాలల కోసం పద్య ఖండికలు వ్రాసే వారు క్వచిత్తుగా కనిపిస్తున్నారు. వారి కోసం ఇలా ఒక బ్లాగ్ నే పెట్టి ఇంత చక్కటి పద్యాలు అందిస్తున్నందులకు మధుర కవి గారు బహుధా అభినందనీయులు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలండీ సీ వీ కుమార్ గారూ!

      సాదరపూర్వకమైన మీ అభిమానమునకు నేను కడుంగడు కృతజ్ఞుడను!

      తొలగించండి
  2. ..బహుచక్కని చిత్రకథాపద్యఖండికలు అందిస్తున్నందులకు బహుదానందము..

    రిప్లయితొలగించండి
  3. చక్కని వ్యాఖ్య వ్రాసి ప్రోత్సాహమునందించు మీకు సర్వదా కృతజ్ఞుఁడను! ధన్యవాదములతో...

    మీ మిత్రుడు
    గుండు మధుసూదన్

    రిప్లయితొలగించండి


  4. తాబేలును తిన నక్కయు
    తా బోవగ కమఠమునకు తట్టెను మార్గం
    బౌ! భూరిగ మెత్తబడుదు
    బాబాయ్ నీటననుముంచు ! భళిరా బతికెన్ :

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగున్నదండీ మీ పద్యం. జిలేబీలా తీయగా ఉన్నది. ధన్యవాదములు!
      "భూరిగ" కంటే "బాగుగ" అంటే?

      తొలగించండి