11, సెప్టెంబర్ 2016, ఆదివారం

నల్లమేఁక...నలుగురు దొంగలు!


ఒక్క విప్రుండు నొక యూర నున్న జనుల
యజ్ఞ యాగాలు దైవ కార్యాలు చేసి,
జీవనము సేయుచును, దానుఁ జిరయశమ్ముఁ
బడసి, ధనధాన్య వృద్ధితో వఱలుచుండె! 1

ఒక్కనాఁ డతఁ డొక యజ్ఞ మొకటి సేయఁ
దలఁచి, యంగడికిం బోయి, వెలయిడి, యొక
నల్లమేఁకనుఁ గొనియును, నపుడు నింటి
దారిఁ బట్టెను, దానిఁ జేతనుఁ గొనియును! 2

బ్రాహ్మణుఁడు మేఁకనుం గొనివచ్చు నట్టి
తరుణ మందున, నల్వురు తస్కరు లది
కాంచి, ’బ్రాహ్మణు వంచించి కౌశలమునఁ
దానిఁ గాఁజేయ వలె’ నని తలఁచినారు! 3

గొలుసునుం జేతనుం బట్టుకొనియు వచ్చు
దారి నడుమ నొక్కండునుఁ దారసిల్లి,
"బ్రాహ్మణోత్తమ! యిదియేమి? పరుగున నిటు
నల్ల కుక్కనుం దెచ్చుచున్నా విదేమి?" 4

అనుచుఁ బలుకంగ నాతఁడు నచ్చెరుపడి,
"యయ్య! యిటు లేల పలికెద? వదియె నల్ల
మేఁకయే గద! సరిపోల్చు!" మిట్టు లనుచుఁ
దనదు దారిని ననుసరించెను నతండు! 5

దారిలో మఱియొక్క నక్తంచరుండు
డగ్గఱించియు "బ్రాహ్మణుండా! యిదేమి?
నల్ల కుక్కనుఁ దెత్తువు? నష్ట పడెనె
నీదు బుద్ధియు నేఁడు?" ననియెను వాఁడు! 6

వాని మాటలు విని, "యేమి? దీనిఁ జూడు
మోయి! నల్ల మేఁకయె యిది! బుద్ధి లేదె?"
యనుచుఁ దనదారి పట్టె నా యయ్యవారు,
నల్ల మేఁకనుఁ జేతిలో నట్లె పట్టి! 7

అట్లు పోవంగ మూఁడవ యతఁ డెదురుగ
వచ్చి, "విప్రవర్యా! మీరు పట్టి తెచ్చు
కుక్క యెవరిది? విడువుఁడు! కుక్కనిట్లు
ముట్టుకొనవచ్చునే కనఁ బుడమి వేల్పు?" 8

’అరరె! యీతఁడుం దీనిఁ గుర్కుర మనియెను!
కాదె యిది, మేఁక? చూడ, మేఁక వలెఁ గాని
పించుచున్నది!’ యనుకొని, "వెడలు మయ్య!
యిదియ మేఁకయే!" యనుచును నదరఁ గొట్టె! 9

అటులె పోవఁగ నాల్గవ యతఁడు వచ్చి,
"ద్విజవరా! నల్ల కుక్కనుఁ దెచ్చుచుంటి?
విట్లు తేఁదగునే విప్రు? లిట్లు ’దీని
ముట్టితిరి’ యన్న మెత్తురే భూసురు లిల?" 10

అనుచుఁ జనఁగా, ధరణి సురుం "డయ్యొ! నన్ను
మోసగించెను గొల్లఁడు ! పుడమి వేలు
పనియుఁ జూడక, నాకిట్లు వంచన నిడ
న్యాయమౌనె? యీ కుక్కయె నాకు వలదు! 11

దీని వదలిపెట్టుట మంచిది!"యనుకొనుచుఁ
జేత గొలుసు వదలి, యింటి కాతఁ డేఁగ,
దొంగ లా మేఁకఁ గొనియు, సంతుష్టులైరి!
సత్యము, నసత్య మన్నచో, సడల వలదు!! 12

 
స్వస్తి

 
గమనిక: మిత్రులారా ఈ దిగువ మీరు పెట్టే ప్రోత్సాహక వ్యాఖ్యలే నన్ను ద్విగుణీకృతోత్సాహవంతుణ్ణి చేసి, మరిన్ని కథలు రాయడానికి పురికొల్పుతాయి. కావున ఈ దిగువన గల డబ్బాలో మీ వ్యాఖ్యను పోస్టు చేయడం మరువ వలదని మనవి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి