ఒక్క కవిగారి యొద్దను నున్న బోయి
లెప్పు డెప్పుడు పని నాపి, తప్పుకొందు
మంచు యోచించుచుండ్రు; సమంచితముగఁ
బనియుఁ జేసి యెఱుంగరు వారు కవికి! 1
ఒక్కనాఁడును కవిగారి యొక్క పాఁడి
యావు తప్పిపోవఁగ, ’దాని నచట నిచట
వెదకి తెమ్మ’ టంచునుఁ గవి, వీరిఁ బిలువ,
బోయి "లిదియ మా పని గాదు! పోవ" మనిరి! 2
కవియు వారి యాలోచనఁ గనియు, "సరియె!
పనినె చేయుఁ" డంచునుఁ; దానె పల్లకి నధి
రోహణము సేసి, "యిఁక చతుర్దోలనమును
మోసి చనునట్టి మీపని, చేసికొనుఁడు! 3
వేగ పల్లకీలో నుండి, వెదకి కొనెద,
నాదు గోవున" టంచుఁ దా నగియు నెక్కె!
బోయి లా పల్లకిని నంత మోయుచుండ,
"నిదియ కా దది, కాదు కా దిదియ" యనుచు; 4
కవియె పల్లకీలో నుండి కనుచు, నాజ్ఞ
లిడుచు, బోయీలఁ ద్రిప్పుచు, నెన్ని స్థలము
లకునుఁ ద్రిప్పనెంచెనొ, యన్నిఁటకును
ద్రిప్పె! బోయీలు విధిలేక, త్రిప్పిరంత! 5
ఎంత తిరిగిన, నా మొద వెచటఁ గలదొ,
దొరుక దాయెను! బోయీలు తిరిగి తిరిగి,
చెమటలం గ్రక్కుకొనుచును, స్థిరత లేక,
నెవ్వఁ బడుచునుఁ దిరిగిన నీరసమున; 6
కాలు కదుపంగ లేకయె, కవినిఁ గాంచి,
"యోయి కవివర్య! బుద్ధి లేకుండ మేము,
’మా పనిని మేము చేతుము! మఱొక పనినిఁ
జేయ’ మంచును, దోషముం జేసితి మయ! 7
మమ్ము మన్నింపు మో యయ్య! మాకు నిపుడు
బుద్ధి వచ్చెను! మేమె గోవును వెదకియుఁ
దెత్తు మిప్పుడే !" యనుచును, దీనముగనుఁ
బలుకఁగాఁ, గవి చిఱునవ్వు లొలుకుచు ననె; 8
"ఆవునుం దేవులాడి, తెం" డనఁగఁ గాదు
మా పని యది! మా పని మోఁత! మమ్ము మోయ
మనినచో, మేము మోసెద’ మంటిరి గద!
ముందు నను నింట దిగఁ బెట్టి, పొండు వెదుక!!" 9
అనఁగ, నట్లె చేసియు, వార లావు కొఱకుఁ
జని, యది యొకచో ఘాసమ్ముఁ గొనుచు నుండఁ,
బట్టి, తెచ్చి, యిచ్చిరి, కవి ప్రమద మంద!
గోఁటితోఁ బోవు దానికి గొడ్డ లేల? 10
స్వస్తి
గమనిక:
మిత్రులారా ఈ దిగువ మీరు పెట్టే ప్రోత్సాహక వ్యాఖ్యలే నన్ను ద్విగుణీకృత ఉత్సాహవంతుణ్ణి చేసి మరిన్ని కథలు రాయడానికి పురికొల్పుతాయి. కావున ఈ దిగువన గల డబ్బాలో వ్యాఖ్యను పోస్టు చేయడం మరువ వలదని మనవి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి