12, జనవరి 2018, శుక్రవారం

భారతదేశపు ప్రప్రథమ మహిళా ఉపాధ్యాయురాలు శ్రీమతి సావిత్రీ బాయి పూలే!



తేటగీతులు:

భరతదేశమ్మునందునఁ బ్రథమ మాని
నీ యుపాధ్యాయి సావిత్రి బాయి ఫూలె
సాహసమ్మునకును సమాజావసరపు
టుద్యమమ్ము నడపినట్టి సద్యశోధి!

ఆమెనుం గూర్చి ముచ్చట లాడకుండ
స్త్రీల స్వేచ్ఛాసమానత్వ లీలఁగూర్చి
మాటలాడఁగలేరయ్య మహిళ లెపుడుఁ
దమకు స్వేచ్ఛ నొసంగిన దైవమగుట!

మును మహాత్ముఁడౌ జ్యోతిబా ఫూలె తోడఁ
దన వివాహమ్ము జరిగిన తదుపరి తన
జీవితమె మాఱిపోయె! సుశ్రేష్ఠుఁడైన
భర్త యడుగు జాడలఁ జరింపఁగఁ దలంచె!

కుల వివక్షతకు వ్యతిరేకులయి జ్యోతి
రావు ఫూలె దంపతులు విరామ మిడక,
వంచనకు గుఱియైనట్టి బాధితులనుఁ
జేరఁదీసి, వెతలఁదీర్చి, స్థిరత నిడిరి!

చదువుకొనుటకునుఁ గుటుంబ సభ్యులెంత
వ్యాతిరిక్త్యమ్ముఁ జూపించి, వంకలిడిన,
ధైర్యముగ నిలువంబడి, ధవుని యాజ్ఞఁ
బడసి, సామాజికోద్యమ పాత్రనుఁ గొనె!

భర్త నుండియుఁ బ్రశ్నించు స్పందనలను
నేర్చుకొని, యగ్ర కులపు మన్నెఱికముపయిఁ
దిరుగఁబడి, ఛీత్కృతులు, ఱాళ్ళ దెబ్బలెన్నొ
లెక్క సేయక, తాఁ బ్రజ్వలించె నపుడు!

అల్ప కుల బాలికలను సమాదరించి,
చదువు నేర్పె! కార్మికుల, కర్షకుల కొఱకు
రాత్రి పాఠశాలలను ప్రారంభపఱచి,
వెలుఁగు లిడి, తాను వెలిఁగె సావిత్రిబాయి!

అగ్ర కులములందున్నట్టి యధవలకును
మూర్ధజమ్ములఁ బట్టియు ముండనమునుఁ
జేయ నెదిరించి, మాన్పంగఁజేసి, వారి
యార్తినిం బాపి, రక్షించె నమ్మవోలె!

విధవలకు శరణము నిడు వేశ్మములను
స్థాపనము సేసి, చదువులఁ జక్కపఱచి,
వారి కాళ్ళపై వారి నిల్వంగఁజేసి,
బ్రతుకు నిచ్చి కాపాడె వరాల తల్లి!

పూణెలోఁ బ్లేగు వ్యాపింపఁ బోరి తాను
తనదు తనయుని సాయమ్ముఁ గొనియు వేగఁ
బ్రజలఁ గాపాడి, చివర కా వ్యాధిసోఁకి,
ప్రాణము ల్వీడి, తానేఁగె స్వర్గమునకు!

అట్టి యసహాయ శూరకు, నట్టి ధీర,
కట్టి సంస్కర్త్రి, కట్టి మహాత్మ, కట్టి
మాత, కట్టి సన్నుత దయామయికి నేను
వందనము సేతు నిరతమ్ము డెందమందు!


స్వస్తి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి