2, అక్టోబర్ 2016, ఆదివారం

తొందరపాటు!


ఒక్క యూరను బ్రాహ్మణుం డొకఁడు గలఁ డ
తండు విష్ణుశర్మాభిధఁ దనరుచుండు!
నతని భార్యయె యన్నపూర్ణమ్మయనఁగఁ
బేరునకుఁ దగు గుణముచే వెలుఁగుచుండు!! 1

ఆమె ప్రేమతో వేసెడి యన్నపు మెతు
కులనుఁ దిని యొక్క ముంగిస కూర్మితోడ
నిల్లుఁ గాఁచుచు నుండును నెల్ల వేళ
లందు ఫణులు రాకుండ సురక్షితముగ! 2

ఒక్క దినమున బాపఁడు ప్రక్క యూర
జరుగు బ్రహ్మోత్సవములకుఁ జనఁగ నటులె
యతని భార్యయుఁ దమ పుత్రు నచటి తొట్టె
లో నిదురపుచ్చి నీటికై తానునుఁ జనె! 3

వార లేఁగుటఁ గాంచి సర్పరిపు వంత
నింటిలోనికి నేఁగి తా హితముఁ గనఁగఁ
గాఁపు గాయుచుండఁగ నొక్క కాళ మచటి
త్రాటిపై నుండి యుయ్యేల దరికి వచ్చె! 4

పామునుం గాంచి ముంగిస పరుగునఁ జని,
తొట్టెపైఁకి లంఘించియు దిట్టతనము
తోడ దానితో వడిగఁ బోరాడి దాని
ఖండములుగఁ జేసియుఁ జంపె ఘనత మెఱయ! 5

పేరునకు ముంగిసయె కాని, ప్రేమమునకు
మనుజు కన్నను నెక్కుడౌ మాన్యయదియె!
మేలు మఱచి కీడొనరించు కూళకన్నఁ
గొలఁది మేల్ గృతజ్ఞ యగు నకులము మిన్న! 6

అహిరిపువు సర్పముం జంపి యచటనె తన
ఘనతఁ జూపింప వేచి యుండిన క్షణమున
నీరముం దెచ్చు గేహిని నినదము విని
పరుగు పరుగున నెదురేఁగెఁ బ్రమదమునను! 7

నోట రక్తమ్ము కాఱ సంతోషముగను
నెదురయిన ముంగినిం గని ముదిత యపుడు
’తనదు కొమరునిఁ జంపె’ నటనుచుఁ దలఁచి
చేర రాఁగానె తన బిందెచేతఁ జంపె! 8

చంపి లోనికి నేఁగి తా సత్వరముగ
నూయెలను గల పుత్రుని డాయఁగఁ జని
సుఖముగా నిద్ర పోయెడి సుతునిఁ గాంచి
క్రింద ముక్కలై యున్నట్టి దృంభువుఁ గనె! 9

కనిన యంత ముంగిస యొనర్చిన కృతమ్ము
సర్వ మవగతమ్మాయెఁ బ్రశస్తమైన
త్యాగముం గని దుఃఖించెఁ దానొనర్చి
నట్టి ద్రోహమ్ముఁ దలఁచియుఁ దుట్టతుదకు! 10

చూచితిరె! మీరు మేల్గూర్చుచుండు జనులఁ
దొందరించియుఁ గీడునుఁ బొందఁజేయు
మౌఢ్యమందించెఁ గద దుఃఖ మాఢ్యులకును!
వలదు! దొసఁ గిడు తొందరపాటు వలదు!! 11


స్వస్తి



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి