8, సెప్టెంబర్ 2016, గురువారం

గొప్పలు తెచ్చిన కీడు



ఒక్క యూరి చెఱువులోన ♦ నుండు కప్ప
చాలఁ బెద్దది యౌటచేఁ, ♦ జాల గర్వ
మున ’ఘనుఁడ’ నంచునుం గప్ప♦లనుఁ గదిసియు,
"నన్ను మించు జీవి జగాన  నున్నదె?" యనె! 1

పిల్ల కప్పలు మదిలోన ♦ నుల్లసిలుచు,
నిజమె కాఁబోలు’ నంచును ♦ నెయ్యముఁ గొని,
దానిఁ దమ రాజుగాఁ, దాము ♦ దాసులుగను
సేవఁ జేయఁ దొడఁగినవి ♦ స్థిరముగాను! 2

ఒక్కనాఁ డొక్క యెద్దు, పే♦రుక్కు గలది,
మందనుం దప్పి, దప్పిక ♦ నంది, చెఱువు
చెంతకునుఁ జేరఁ, గప్పలుఁ ♦ జిత్రముగనుఁ
జూడ మొదలిడినవి మున్నుఁ ♦ జూడకునికి! 3

పిల్ల కప్పలు వెంటనే ♦ పెద్ద కప్పఁ
జేరి, యిట్టుల నడిగెను ♦ శీఘ్రముగను;
"రాజ! నాఁడు ’నా కన్న వ♦ర్ణమ్మునందు,
దేహమందు గొప్పదియగు ♦ దేహి లేదు; 4

నన్ను మించు వారు జగము♦నను గలారె?’
యనుచుఁ జెప్పితిరయ మీరు! ♦ వినుఁడు, నేఁడు
మేము నీకన్న పెద్దదౌ, ♦ మేఘము వలె
నివ్వటిల్లు జంతువునుఁ గం♦టిమి తటమున!" 5

అనుచుఁ బలుకుచుండిన కప్ప♦లను గనుచును,
బెద్ద కప్పయు నెంతయో ♦ విస్మిత యయి,
"శీఘ్రమే నన్నుఁ గొనిపొండు! ♦ చేరఁ జనియు,
దాని వీక్షింతు నేనిప్పు" ♦ డనుచుఁ బలికె! 6

పిల్ల కప్పలు సనుచుండ, ♦ వేగముగను
వెంబడించియుఁ, దీరాన ♦ పెద్ద దైన
జంతువగు నెద్దునుం జూచి, ♦ సంభ్రమమునఁ,
దననుఁ బిల్ల కప్పలు నమ్మఁ♦గ, నిటు పలికె! 7

"దానిఁ జూచి యాశ్చర్యప♦డంగ వలదు!
దాని ’నె’ ద్దని యందురు! ♦ వీను లలర
వినుఁడు! చిన్నదౌ చెఱువు నో♦పెడునె యనుచు,
నేను పెరుగంగ లేదోయి ♦ నిక్కముగను! 8

నిజముగా నాదు రూపమ్ము ♦ నిపుడు పెంచి,
నాదు గొప్పనుఁ జూపింతు" ♦ ననుచుఁ బలుకఁ
జప్పటులఁ గప్ప లన్నియుఁ ♦ జఱచుచుండ;
వెంటనే పెద్ద కప్ప తాఁ ♦ బెరుఁగఁ దివిరె! 9

ఊపిరిని బిగఁబట్టియు, ♦ నొప్పునటులు
గాలిఁ బీల్చఁగఁ, గడుపుబ్బెఁ! ♦ గప్పలన్ని
చేరి, ’యె ద్దంతఁ గ’ మ్మనఁ, ♦ జేయునదియు
లేక, యింకను గాలిఁ బీ♦ల్చెను రయమున! 10

ఘనతఁ జాటంగ నెంచియుఁ ♦ గరము గాలిఁ
బీల్చు కొలఁదియు జఠరమ్ము ♦ పెరిఁగి పెరిఁగి,
ప్రేలి, మరణించె, బింకంపుఁ ♦ బెంపు కతన!
గొప్పలకుఁ బోయి యాపదం ♦ గూల వలదు!! 11

స్వస్తి


గమనికమిత్రులారా ఈ దిగువ మీరు పెట్టే ప్రోత్సాహక వ్యాఖ్యలే నన్ను ద్విగుణీకృత ఉత్సాహవంతుణ్ణి చేసి మరిన్ని కథలు రాయడానికి పురికొల్పుతాయి. ఈ దిగువ వ్యాఖ్య రాయడం మరువ వలదు అని మనవి.


2 కామెంట్‌లు: